Anil Ambani | ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో వచ్చేవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లుగా వార్తా సంస్థ పీఐటీ పేర్కొంది. అనిల్ అంబానీని ఆగస్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించిన విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జరిగిన రుణ మోసంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో నవంబర్ 14న విచారణకు హాజరు కావాలని అనిల్ అంబానీని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అంబానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తులో భాగంగా ఈ ఏజెన్సీ ఇటీవల రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. పలు సెక్షన్ల కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నది. అనిల్ అంబానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తుల్లో ఎక్కువ భాగం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందినవని తెలిపాయి. ఈ కంపెనీ ప్రస్తుతం రిజల్యూషన్ ప్రొఫెషనల్ (RP), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతల కమిటీ (CoC) నియంత్రణలో ఉందని గ్రూప్ పేర్కొంది.