హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. రుణ వసతి, సాంకేతిక సహకారం అందక, అంతర్జాతీయ మారెట్లో పోటీని తట్టుకోలేక అనేక ఎంఎస్ఎంఈలు నష్టాల్లో నడుతున్నాయి. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. 2022-23 డాటా ప్రకారం.. ఎంఎస్ఎంఈ రంగం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 30.1%, తయారీ రంగంలో 36%, దేశ ఎగుమతుల్లో 45% వాటాను కలిగి ఉన్నది.
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (యూఆర్‌పీ), ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫాం (యూఏపీ) డాటా ప్రకారం.. 2025 మార్చి 15 నాటికి దేశవ్యాప్తంగా 6,13,37,576 ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, వాటి ద్వారా 18,17,67,574 మంది ఉపాధి పొందుతున్నారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. యూపీఆర్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈల సంఖ్య 2020-25 మధ్య కాలంలో 28.29 లక్షల నుంచి 6.13 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్లు ఏటేటా పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు ఎంఎస్ఎంఈల మనుగడను దెబ్బతీస్తున్నాయి.
గత దశాబ్దంలో (2015-2025) దేశవ్యాప్తంగా మూతపడిన ఎంఎస్ఎంఈలపై జాతీయ స్థాయిలో కచ్చితమైన డాటా అందుబాటులో లేదు. కానీ, కొన్ని నివేదికల ప్రకా రం.. ఆర్థిక ఒత్తిడి, నగదు ప్రవా హ సమస్యలు, ఆలస్య చెల్లింపులు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), డీమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు) లాంటి విధానాలతోపాటు కొవి డ్ మహమ్మారి వల్ల అనేక ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. కొవిడ్ సంక్షోభ సమయం (2020-21)లో దేశవ్యాప్తంగా దాదాపు 20-25% ఎంఎస్ఎంఈలు తాతాలికంగా లేదా శాశ్వతంగా మూతపడినట్టు అంచనా.
ఆర్థిక చట్టం-2023 ద్వారా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 43బీలో ‘హెచ్’ క్లాజ్‌ను చేర్చారు. ఈ నిబంధన ప్రకారం.. ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన మొత్తాలను సమయ పరిమితి (రాతపూర్వక ఒప్పందం ఉంటే 45 రోజులు, లేకపోతే 15 రోజులు) లోగా చెల్లించాలి. ఈ సమయం మించితే చెల్లింపు జరిగిన సంవత్సరంలోనే డిడక్షన్‌గా అనుమతించబడుతుంది. ఈ నిబంధన వల్ల ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు అందుతున్నప్పటికీ కొన్ని కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
దీంతో పెద్ద సంస్థలు ఎంఎస్ఎంఈలతో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఆర్డర్లు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తాయని ఎంఎస్ఎంఈ సంఘాలు వాపోతున్నాయి. ‘హెచ్’ క్లాజ్ వల్ల పన్ను భారం పెరుగుతున్నదని, నగదు ప్రవాహంపై ఒత్తిడి పడుతున్నదని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనను తొలగించాలని లేదా తొలగించాలని ఎంఎస్ఎంఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు.