ముంబై, జూలై 16: పండుగ సీజన్ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు బోలేడు. వచ్చేది పండుగ సీజన్ కావడంతో కొత్తగా 2.16 లక్షల మందికి సీజనల్ జాబ్స్ లభించనున్నాయని ఓ సర్వే వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి రిక్రూట్మెంట్లు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరగనున్నాయని వర్క్‌ఫోర్స్ సొల్యుషన్స్ సంస్థ అడెక్కో ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వీరిలో రిటైల్ రంగంలో అత్యధిక మందికి ఉపాధి లభించనుండగా, ఈ-కామర్స్, బీఎఫ్ఎస్ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య, రవాణా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కూడా లభించనున్నాయని పేర్కొంది.
వచ్చే నెలల్లో రక్షాబంధన్, దసరా, దీపావళితోపాటు సీజనల్ సేల్స్, పెండ్లిండ్ల సీజన్ కూడా తోడవడంతో తాత్కాలిక ఉద్యోగులకు డిమాండ్ నెలకొన్నదని తెలిపింది. కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ ఆశావాదంగా ఉండటం, సానుకూల వర్షాలు కురుస్తుండటం, ఎన్నికల తర్వాత ఆర్థిక రంగం తిరిగి పుంజుకోవడం ఈసారి ఉద్యోగ నియామకాలు పుంజుకోవడానికి ప్రధాన కారణాలని తెలిపింది.