రూపాయిని ఇంకా నష్టపోనివ్వాలి.. మరికొంత కాలం ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు
కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అప్పుడే అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను భారతీయ కరెన్సీ తట్టుకోగలదని వ్యాఖ్యానించారు.
- ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్లను పెంచవద్దు
- ఇతర ద్రవ్యపరమైన సాధనాలను వాడాలి
- ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
ముంబై, మే 28: కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అప్పుడే అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను భారతీయ కరెన్సీ తట్టుకోగలదని వ్యాఖ్యానించారు. అలాగే ద్రవ్యోల్బణం విజృంభిస్తే.. దాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్ల పెంపునకు బదులు ఇతర ద్రవ్యపరమైన సాధనాలను వినియోగించాలని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆర్బీఐకి దువ్వూరి సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను వచ్చే వారం ఆర్బీఐ చేపట్టనున్న క్రమంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడంలో ద్రవ్య విధానం పాత్ర ఎప్పుడూ చివర్లోనే అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే వడ్డీరేట్ల పెంపుతోనే ద్రవ్యోల్బణం ఆందోళనల్ని తగ్గించవచ్చని విశ్వసిస్తే ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయవచ్చునని కూడా అన్నారు.
నిజంగా సవాలే..
ప్రతికూల పరిస్థితుల్లో రూపాయి మారకం విలువను స్థిరీకరించడం నిజంగా ఓ సవాలేనని దువ్వూరి అన్నారు. కాగా, ఈ నెల 20న డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 97 మార్కు దరిదాపుల్లోకి వెళ్లింది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి కొద్దికొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. ‘మారకం రేటు సంక్షోభాలు చివరకు నమ్మకాన్నే దెబ్బతీస్తాయి. ఒకవేళ మదుపర్లు, దిగుమతిదారులు, ప్రజలు రూపాయి విలువ మరింత పడిపోతుందనే విశ్వసిస్తే.. ఇంకా అప్రమత్తమవుతారు.
ఈ పరిణామం రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. అప్పుడు లాభాల కోసం ఎగుమతిదారులు తమ డాలర్లను వెనుకకు తీసుకురావడాన్ని ఆలస్యం చేస్తారు. ఫలితంగా దిగుమతిదారులు డాలర్ల కొనుగోలుకు ఎగబడుతారు. ప్రజలు బంగారంపై దృష్టి పెడితే.. మదుపర్లు నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు’ అని దువ్వూరి విశ్లేషించారు. ఈ సమయంలోనే ఆర్బీఐ, ఇతరత్రా విధానకర్తలు భయపడకుండా, రక్షణాత్మకంగా కాకుండా సమర్థవంతమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తగ్గిస్తే అది.. పెంచితే ఇది..
‘కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే దేశ ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చినట్టవుతుంది. కానీ ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదం ఉన్నది. పరిస్థితులు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనానికీ దారితీయగలవు. అలాగే వడ్డీరేట్లను పెంచితే జీడీపీకి దెబ్బ. కాబట్టి ఈ విషయంలో బ్యాలెన్సింగ్.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీకి ఎప్పుడూ కత్తి మీద సామే’ అని దువ్వూరి అభిప్రాయపడ్డారు. జూన్ 3-5 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్య సమీక్ష జరుగనున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో పరుగులు పెడుతున్న ముడి చమురు ధరలు.. దేశీయ మార్కెట్లో ఇంధన ధరల్ని ఎగదోస్తున్నాయి.
ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు దాదాపు రూ.8 చొప్పున ఎగిశాయి. సీఎన్జీ, వంటగ్యాస్ ధరలూ ఎగబాకాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఆర్బీఐ ద్రవ్య సమీక్ష నిర్ణయాలు అత్యంత కీలకమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతం వద్ద ఉన్నది. ఏడాది కిందట 6.50 శాతంగా ఉంటే.. 1.25 శాతం మేర ఆర్బీఐ తగ్గించింది.
- ఈ నెల 20న ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ రూ.96.86 వద్దకు పతనం
- ఒకానొక దశలో తొలిసారి రూ.96.95 స్థాయికి క్షీణించిన రూపాయి మారకం
- ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.5.7 (6.1%) నష్టపోయిన రూపాయి విలువ
- డాలర్‌తో పోల్చితే గత ఏడాది ఆఖర్లో రూ.89.88 వద్ద స్థిరపడిన రూపీ వాల్యూ
- పశ్చిమాసియా సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి 5 శాతం దిగజారిన దేశీయ కరెన్సీ విలువ
- గడిచిన ఏడాది కాలంలో ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి వాటిల్లిన నష్టం 10 శాతంపైనే
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

