కోల్‌కతా, జూన్ 19: వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ శకునమే అయినప్పటికీ.. ఆహారేతర, ఇంధనేతర ద్రవ్యోల్బణాలు ఇంకా ఎక్కువగానే ఉండటం ఆందోళనకరమేనని ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ లిమిటెడ్ అభిప్రాయపడింది. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.8 శాతంగానే ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం దిగిరావడం కలిసొచ్చింది. అయితే వరుసగా 4 నెలల నుంచి ఆహార-ఇంధనేతర ద్రవ్యోల్బణాలు 4 శాతంపైనే కదలాడుతుండటం మాత్రం ఆమోదయోగ్యం కాదని క్రిసిల్ అంటున్నది. ఆహార, ఇంధన ఉత్పత్తులు మినహా మిగతా వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుచేస్తున్నది. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనని వ్యాఖ్యానించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల దేశంలో బలపడుతున్న డిమాండ్‌కు అద్దం పడుతుందని అంటూనే.. ధరలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందనీ చెప్తున్నది. కాగా, దేశీయ పరిస్థితుల కంటే అంతర్జాతీయ ఆర్థిక ఒడిదొడుకులే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తున్నాయని క్రిసిల్ పేర్కొన్నది.
దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కదులుతున్నాయని క్రిసిల్ తెలిపింది. గోల్డ్ రేట్లపై దేశీయ కారణాల ప్రభావం చాలా తక్కువేనని కూడా పేర్కొన్నది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణంలో బంగారం ధరల వాటా 1.1 శాతంగా ఉంటుందన్నది. కానీ ఆహార-ఇంధనేతర ద్రవ్యోల్బణాలపై పసిడి విలువ ప్రభావం ఎక్కువేనని వివరించింది. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నది.
రూపాయికి మరిన్ని చిల్లులుపడ్డాయి. వరుసగా మూడోరోజూ గురువారం రూపాయి విలువ 30 పైసలు పడిపోవడంతో రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 30 పైసలు పడిపోయి 86.73 వద్ద నిలిచింది. గత మూడు రోజుల్లో 69 పైసలు పడిపోయినట్టు అయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావడం, ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.