Shashank Goyal | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ మార్కెట్లో వాణిజ్య దౌత్యవేత్తల పాత్ర కీలకంగా మారిందని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ‘విదేశీ వాణిజ్యం-పెట్టుబడులు’ అంశంపై ఓ అవగాహన కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ నెల 30దాకా జరిగే ఈ కార్యక్రమానికి ఈజిప్టు నుంచి 14 మంది అగ్రశ్రేణి దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్లో తాజా పోకడలు నిపుణుల అవసరాన్ని పెంచుతున్నాయన్నారు. దేశాల మధ్య దౌత్య, రాజకీయ సంబంధాలను పెంపొందించడంలో భౌగోళిక, వ్యూహాత్మక పరిస్థితులూ ప్రధానమేనన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ హెడ్ డాక్టర్ మాధవి రావులపాటి తదితరులు పాల్గొన్నారు.