హైదరాబాద్, జనవరి 21: ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాభాలకు అమ్మకాల సెగ గట్టిగానే తాకింది. అమెరికాలో కంపెనీ విక్రయాలు భారీగా తగ్గడంతో గత త్రైమాసికపు లాభంలో 14 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.1,210 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.1,413 కోట్లుగా ఉన్నది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,357 కోట్ల నుంచి రూ.8,727 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయని, బ్రాండెడ్ బిజినెస్ ఆకర్షణీయంగా ఉన్నదని, పలు ఔషధాలకు అమెరికా మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో కొంతమేర ప్రభావ చూపాయన్నారు.