హైదరాబాద్, జూలై 26(బిజినెస్ బ్యూరో): రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక లాభంలో 18 శాతం వృద్ధిని కనబరిచింది. ఏడాది క్రితం రూ.1,189 కోట్లుగా ఉన్న పన్నులు చెల్లించిన తర్వాత లాభం గత త్రైమాసికానికిగాను రూ.1,405 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 29 శాతం ఎగబాకి రూ.6,757.90 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.5,232.90 కోట్లుగా ఉన్నది.
‘తొలి త్రైమాసికంలో అమ్మకాలు భారీగా పెరగడం, మార్జిన్లు అధికంగా ఉండటం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. అమెరికా, రష్యాలో పలు జనరిక్ ఉత్పత్తులు విడుదల చేయడం కూడా కలిసొచ్చింది. భవిష్యత్తులో పరిశోధనలు, నూతన ఉత్పత్తుల కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నాం’
– జీవీ ప్రసాద్, రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ