హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ బిజినెస్ బ్యూరో): ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అమెరికా భయం పట్టుకుంది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలకు దిగుతుండటమే ఇందుకు కారణం. ఇరుగుపొరుగు దేశాలకు ఇప్పటికే సుంకాల సెగను తగిలించిన ట్రంప్.. వచ్చే నెల నుంచి భారత్‌కూ అది తప్పదని ప్రకటించేశారు. ఇక మన పొరుగు దేశం చైనాతో అమెరికా ఎప్పుడూ కాలు దువ్వుతూనే ఉంటుంది. ఇందుకు అనేక సమీకరణాలున్నాయి. ఈ విషయంలో ట్రంప్ రెండాకులు ఎక్కువే చదువుకున్నారు. అందుకే తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా లేక మలిసారి అధ్యక్షుడిగా ఎన్నికై వచ్చినా చైనాపై గుడ్లురిమే చూస్తున్నారు. కానీ ఇక్కడ నొక్కిమరీ చెప్పుకోవాల్సిందేమిటంటే.. అమెరికా, ముఖ్యంగా ట్రంప్ నాకు ప్రాణమిత్రుడంటూ ప్రధాని నరేంద్ర మోదీ తిరుగుతున్నా.. భారత్‌పై సుంకాల సమరానికి తెర లేవడమే. ఇదే అంశంపై ప్రముఖ రాజకీయ-ఆర్థిక విశ్లేషకులు డీ పాపారావు ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
అన్ని దేశాలను చూసినట్టుగానే ట్రంప్ భారత్‌నూ చూస్తున్నారు. కానీ ఇది అర్థం కాని మన పాలకులు ట్రంప్ సేవలో తరించిపోతున్నారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ వంగివంగి దండాలు పెట్టడమే కాదు.. సాష్టాంగపడిపోతుండటం నిజంగా దురదృష్టకరం. అమెరికా-భారత్ రాజకీయాల్లో భావసారుప్యత కలిగిన రిపబ్లికన్ పార్టీ, బీజేపీలకు పెద్దలుగా ఉన్న ట్రంప్, మోదీలు.. అంతర్జాతీయ వేదికలపై చెట్టాపట్టాలేసుకుని తిరిగినా భారత్‌ను ఓ అవసరంగా అగ్రరాజ్యం చూస్తున్నదే తప్ప మరొకటి కాదు.
ప్రధానంగా అన్నింటా తమ ఆధిపత్యానికి అడ్డుగా వస్తున్న చైనాను దెబ్బతీయాలంటే ప్రత్యామ్నాయం భారతేనని అమెరికాకు బాగా తెలుసు. అయితే చైనాతో మనకున్న (బీజేపీ భావజాలం) విభేదాల దృష్ట్యా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తుండటమే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు అని చెప్పక తప్పదు. చైనాపై అమెరికాకున్న కసి తీరితే.. అప్పుడు భారతే టార్గెట్ అన్నది మరువద్దు. నిజానికి ట్రంప్ తమ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారుగానీ భారత్‌కు ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా చేస్తున్న మేలేమీ లేదు. మొదట్నుంచీ ట్రంప్ వైఖరి ‘మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ అన్నట్టుగానే ఉంటున్నది.
తాను చెప్పదల్చుకున్నది ట్రంప్ సూటిగా చెప్తున్నా.. చైనాపై అమెరికా సుంకాలు పెంచితే ఏర్పడే వాణిజ్య యుద్ధం మనకు కలిసొస్తుందేమోనన్న భ్రమలో భారత్ ఉండటం చాలా విచారకరమే. ట్రంప్ టారిఫ్‌లతో భారతీయ ఫార్మా రంగానికి ఎదురుదెబ్బే. ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్న జనరిక్ ఔషధాలతో అమెరికన్ల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అయినప్పటికీ మా దేశంలోకి వచ్చే ఫార్మా దిగుమతులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ చెప్పడం.. దానికి బెంబేలెత్తిపోయి అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తులపై సుంకాలను తగ్గించడం, మరికొన్నింటినీ పరిశీలిస్తుండటం మోదీ సర్కారు అపరిపక్వతకు నిదర్శనం.
పైగా ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి అవసరం లేకున్నా, నష్టమని తెలిసినా.. అమెరికా నుంచి రక్షణ, చమురు దిగుమతుల్ని చేసుకోవాలనుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకే ముప్పు. రష్యా, అరబ్ దేశాలతో పోల్చితే అమెరికాలోని శిలాజ ఇంధనం ఖరీదెక్కువ. అయితే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని అమెరికా-భారత్ భావిస్తున్న నేపథ్యంలో మనపై ఈ భారం తప్పేట్టు లేదు. మన దగ్గర్నుంచి ఏం కొంటామన్నది చెప్పని ట్రంప్ సర్కారు.. మా దగ్గర్నుంచి మాత్రం ఇంత కొనాలని భారత్‌ను ఆదేశిస్తుండటం అమెరికా ఆధిపత్య ధోరణికి నిలువుటద్దమే.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు, పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, కరోనాను ఎదుర్కోవడం, ద్రవ్యోల్బణం అదుపు, నిరుద్యోగం ఇలా చెప్పుకుంటూపోతే గడిచిన దాదాపు పదకొండేండ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందనే చెప్పవచ్చు. చివరకు ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రకటించిన పీఎల్ఐ స్కీమ్ కూడా దాదాపు ఉత్తదే అని తేలిపోయింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్‌లను పెంచితే భారత్‌లో తయారై అమెరికాకు ఎగుమతి అవుతున్నవన్నీ ఒక్కసారిగా పిరమైపోతాయి.
ముఖ్యంగా దేశంలో తయారవుతున్న స్మార్ట్ఫోన్లకు అమెరికాలో ధరలు పెరిగి గిరాకీ తగ్గిపోతుంది. ఇదే జరిగితే ఇక్కడున్న యాపిల్ (ఐఫోన్) తదితర సంస్థలన్నీ వెనక్కిపోవడం ఖాయమే. అల్యూమినియం, ఉక్కు మరికొన్నింటిపైనా సుంకాల భారం తప్పడం లేదు. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే ట్రంప్ టారిఫ్‌లతో భారత్‌కే ఎక్కువ నష్టం. అమెరికా నిర్ణయాలకు చైనా గట్టిగా స్పందిస్తుండటంతో దానికొచ్చే నష్టమేమీ లేదు. ఎటొచ్చి అటు అమెరికాకు, ఇటు చైనాకు దగ్గర కాలేక రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలేది భారతే.
ఈ ట్రేడ్ వార్తో చైనా నుంచి పరిశ్రమలు భారత్‌కు వచ్చినా.. అవే సుంకాలు ఇక్కడా ఉన్నందున కార్పొరేట్లు ఆఖరుకు అమెరికాకే వెళ్లిపోయే వీలున్నది. అయితే వాణిజ్యం విషయంలో కలిసి నడుద్దామంటూ ముందుకొచ్చిన చైనాతో భారత్ జట్టు కడితే లాభదాయకమనే చెప్పవచ్చు. సుంకాల సెగను తప్పించేందుకు ఆగమేఘాలపై అమెరికాకు వెళ్లిన మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో ఒనగూరిందేమీ లేదు మరి. మొత్తానికి ట్రంప్ దృతరాష్ట్ర కౌగిలి నుంచి మోదీ బయటపడితేనే భారత్‌కు భవిష్యత్తు. దేశ ప్రయోజనాలను ఫణంగా పట్టైనా, పార్టీ ప్రయోజనాలను చూసుకుంటే మాత్రం అంతకన్నా ఘోర తప్పిదం మరొకటి ఉండదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు మోదీ సర్కారు అనవసరంగా భయపడిపోతున్నదని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అభిప్రాయపడుతున్నది. ట్రంప్ టారిఫ్‌లకు బెంబేలెత్తిపోయి చర్చలు జరుపాల్సిన పనిలేదని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ అంటున్నారు. చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు స్పందిస్తున్నట్టుగానే ట్రంప్ సుంకాల విషయంలో భారత్ వైఖరి ఉండాలని సూచించారు.
అమెరికా మోటర్‌సైకిళ్లు తదితరాలపై సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీటీఆర్ఐ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. అమెరికా ప్రయోజనాలు ఎక్కువగా ఉండేలా ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్లకు భారత ప్రభుత్వం తలొగ్గితే నష్టమేనంటున్న ఆయన.. తప్పుడు గణాంకాలు, సమాచారంతో ట్రంప్ సర్కారు లేనిపోని విమర్శలకు దిగుతున్నదని మండిపడ్డారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమెరికా డిమాండ్లను ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తుండటం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తున్నది.
– డీ పాపారావు (9866179615)
ప్రముఖ రాజకీయ-ఆర్థిక విశ్లేషకులు
(సమాధిలోకి-సామ్రాజ్యవాదం, మానవాళికి మహోదయం పుస్తకాల రచయిత)