న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచదేశాలు వెంటనే స్పందించాయి. సుంకాల తగ్గింపు కోసం ట్రంప్‌నకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తూనే తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పలు దేశాలు హెచ్చరించాయి. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందిస్తూ వాణిజ్య యుద్ధం ఎవరికీ లాభదాయకం కాదని అన్నారు. ఎటువంటి పర్యవసానాలకైనా తాము సిద్ధమని, ఏ పరిణామాన్ని తాము తోసిపుచ్చలేమని ఆయన పార్లమెంట్‌కు వెల్లడించారు. ట్రంప్ ప్రకటించిన భారీ సుంకాలకు వ్యతిరేకంగా పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. ట్రంప్ చర్య ప్రపంచ వాణిజ్య విధానాన్ని మౌలికంగా మార్చివేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ విధించిన భారీ సుంకాలను వెంటనే రద్దు చేయాలని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ట్రంప్ చర్యలు ప్రపంచ ఆర్థిక అభివృద్ధిని ప్రమాదకరమని, అమెరికా ప్రయోజనాలతోపాటు అంతర్జాతీయ సరఫరా లంకెలను ఇవి దెబ్బతీస్తాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఏకపక్ష సుంకాలను వెంటనే రద్దు చేయాలని, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని చైనా అమెరికాకు సూచించింది. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరని, రక్షణవాదానికి అవకాశం లేదని వ్యాఖ్యానించింది.
ఆస్ట్రేలియా బీఫ్‌పై భారీ సుంకాల విధింపుపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ స్పందిస్తూ ఈ అన్యాయమైన చర్యకు అమెరికన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కారణంగానే తమ ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించడం లేదని, అధిక ధరలకు, తక్కువ అభివృద్ధికి దారితీసే ఈ పోటీలో తాము చేరబోమని ఆయన స్పష్టం చేశారు.వాణిజ్య యుద్ధాలు ఇరుపక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. స్పానిష్ ప్రధాని పెడ్రో శాన్‌చెజ్ స్పందిస్తూ తమ దేశ కంపెనీలు, కార్మికులను రక్షించుకుంటామని, స్వేచ్ఛా వాణిజ్యానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.
వాణిజ్య అంతరాలు పెరగడం తమకు ఇష్టం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ పేర్కొన్నారు. యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, అమెరికాతో వాణిజ్య సహకారాన్ని పునరుద్ధరించుకోవాలన్నదే తమ ఆకాంక్షని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ కొత్త సుంకాలపై ఏప్రిల్ నెలాఖరులోగా యూరోపియన్ యూనియన్ స్పందిస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వ మహిళా ప్రతినిధి తెలిపారు. స్టీల్, అల్యూమినియంపై అమెరికా చర్యలను తిప్పికొట్టేందుకు ఈయూ ముందుగా ప్రయత్నిస్తుందని, తర్వాత రంగాల వారీగా చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.
కాగా, ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కొనాలని బ్రెజిల్ బుధవారం పార్లమెంట్లో ఓ చట్టాన్ని ఆమోదించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వా నుంచి ఎటువంటి తక్షణ స్పందన వెలువడనప్పటికీ సుంకాలు ఎదురైతే తమ దేశం చూస్తూ ఊరుకోబోదని గత వారం ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే అమెరికానుంచి దిగుమతి అవుతున్న కొన్ని ఆటో దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను పరిశీలిస్తున్నట్టు కెనడా ప్రకటించింది.