న్యూఢిల్లీ, ఆగస్టు 28 : భారతీయ వస్తూత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌ల భారం రెట్టింపైంది. తన మాటను కాదని రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకుగాను ఆగ్రహించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన జరిమానా సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. దీంతో అమెరికాకు జరుగుతున్న భారతీయ ఎగుమతులపై సుంకాలు 50 శాతానికి చేరాయి. ఇప్పటికే తమతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం పేరిట భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకాలను ట్రంప్ వేసిన విషయం తెలిసిందే. అయితే వీటికి అదనంగా ఇప్పుడు మరో 25 శాతం ఫైన్ టారిఫ్‌లు తోడయ్యాయి మరి. ఫలితంగా రొయ్యలు, టెక్స్టైల్, వజ్రాలు, రత్నాలు-ఆభరణాలు, పాదరక్షలు, తోలు తదితర ఎగుమతిదారులంతా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ రంగాలపై ఆధారపడ్డ లక్షలాది ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తూ ఆందోళనకరంగా తయారవడం గమనార్హం. అయితే భారతీయ వస్త్ర పరిశ్రమపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు 40 దేశాల్లో టెక్స్టైల్ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. అలాగే పరిశ్రమ వర్గాలతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం సమావేశాలను నిర్వహిస్తున్నది. ఏ రకమైన మద్దతులిస్తే బాగుంటుందన్నదానిపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ట్రంప్ టారిఫ్‌లతో ఇరు దేశాల సంబంధాలు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగితే చివరకు భారత్-అమెరికా మళ్లీ కలిసే ముందుకెళ్తాయన్న ఆశాభావాన్ని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వ్యక్తం చేశారు.
గత ఆర్థిక సంవత్సరం (2024-25) భారతీయ వాణిజ్య ఎగుమతులు మొత్తం 437.42 బిలియన్ డాలర్లుగా ఉంటే.. అమెరికా వాటానే దాదాపు 20 శాతం (86.5 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. నిజానికి 2021-22 నుంచి భారత్‌కు అమెరికానే ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంటున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం ఇరు దేశాల ద్వైపాక్షిక్ష వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక తాజా టారిఫ్‌లు టెక్స్టైల్ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సుంకాలతో ధరలు అమెరికాలో పెరిగే వీలుందని, బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని ఎగుమతిదారులు చెప్తున్నారు. ఇదే జరిగితే భారతీయ వస్త్ర పరిశ్రమపై పెను ప్రభావమే ఉంటుందంటున్నారు. భారతీయ వజ్రాలు, రత్నాలు-ఆభరణాల ఇండస్ట్రీకి కూడా తుర్కియే, వియత్నాం, థాయిలాండ్ దేశాల నుంచి గట్టి పోటీ ఉండొచ్చని, ఆ దేశాలపై తక్కువ టారిఫ్లున్నాయని గుర్తుచేస్తున్నారు.
అమెరికా సుంకాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఆయా రంగాల షేర్లపై పెద్ద ఎత్తునే ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్స్టైల్స్, రత్నాలు-ఆభరణాలు, తోలు ఆధారిత కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోను కావచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సముద్ర ఉత్పత్తులు, పాదరక్షలు, డైరీ, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ కంపెనీల షేర్లు సైతం సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కోవచ్చంటున్నారు. గురువారం ట్రేడింగ్‌లో కిటెక్స్ గార్మెం ట్స్ షేర్ విలువ 5 శాతం పడిపోయింది. పియర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్, సియారామ్ సిల్క్ మిల్స్, రేమాండ్ లైఫ్ైస్టెయిల్, అలోక్ ఇండస్ట్రీస్, రూప అండ్ కంపెనీ, వెల్స్పన్ లివింగ్, ట్రిడెంట్ షేర్లూ నిరాశపర్చాయి.
భారత్‌పై ఇంతటి భారీ స్థాయిలో అమెరికా సుంకాలు విధించడం వెనుక ఆ దేశాధ్యక్షుడి విస్తృత వ్యూహాత్మక విధానాలే ఉన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఓ ప్రముఖ టెలివిజన్‌తో మాట్లాడుతూ.. టారిఫ్‌లను ట్రంప్ కేవలం వాణిజ్యపరమైన సాధనాలుగా మాత్రమే వాడట్లేదని.. వాటిని రాజకీయ, ఆర్థిక శక్తి వినియోగ సాధనాలుగా కూడా చూస్తున్నారని చెప్పారు. అమెరికన్లపై పన్నులు వేయడం కంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకోవడం సులభమని ట్రంప్ భావిస్తున్నారన్నారు. అలాగే అమెరికా కరెంట్ ఖాతా లోటు, వాణిజ్య లోటును ఇతర దేశాలు లాభంగా మార్చుకుంటున్నాయన్న ఆలోచన కూడా ట్రంప్‌లో ఉండొచ్చని చెప్పారు.
పెట్టుబడి నిర్ణయాలను అమెరికా సుంకాలు ప్రభావితం చేసే వీలుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. అలాగే రాబోయే రోజులు కార్పొరేట్లకు ఇబ్బందికర వాతావరణాన్నే సృష్టిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా, తాజా టారిఫ్‌లతో డైమండ్ పాలీషర్స్ ఈ ఆర్థిక సంవత్సరం 30 శాతం వరకు ఆదాయాన్ని కోల్పోయే వీలుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయ పరిశ్రమకు అమెరికాయే పెద్ద మార్కెట్‌గా ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. అయినప్పటికీ భారతీయ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప డిమాండ్ ఉందని, అమెరికన్లు నాణ్యత విషయంలో రాజీపడబోరన్న ధీమాను పలువురు వజ్రాల వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ధరల పెరుగుదల ప్రభావం తాత్కాలికమేనన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోకపోతే ట్రంప్ టారిఫ్‌లు భారత జీడీపీ వృద్ధిరేటును అర శాతం తగ్గించగలవు.
ఇకనైనా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాల మార్కెట్లపై దృష్టిపెట్టాలి.
6 నెలల్లో 25% భారతీయ వస్త్ర ఎగుమతులు ప్రభావితం అవుతాయి.
50 శాతం సుంకాలు భారతీయ రత్నాలు-ఆభరణాల పరిశ్రమకు ఎదురుదెబ్బ.
అమెరికాకు భయపడి భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దు.
అమెరికాలో భారతీయ వస్తూత్పత్తులపై దిగుమతి సుంకాలు 50 శాతానికి పెరిగిన నేపథ్యంలో మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌లను కేంద్ర ప్రభుత్వ విదేశీ విధాన వైఫల్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ సుంకాల భారంతో కేవలం 10 రంగాల్లోనే 2.17 లక్షల కోట్ల నష్టాన్ని చూడాల్సి వస్తుందని మండిపడ్డారు. దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మొత్తంగా రైతులు, వ్యాపార-పారిశ్రామిక రంగాలు, ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బగా అభిప్రాయపడ్డారు. అమెరికా సుంకాలు తమిళనాడు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
వేలాది ఉద్యోగులు రోడ్డునపడే ప్రమాదం ఉందని, కేంద్రం వెంటనే ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల రుణగ్రహీతలకు రెండేండ్ల మారటోరియం ఇవ్వాలని, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. అలాగే ట్రంప్ టారిఫ్‌లకు ధీటుగా భారత్‌లోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపైనా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అమెరికా సుంకాల పెంపు అని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.