సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి హెడ్‌లైన్స్‌కు ఎక్కాడు.
ప్రతీకార సుంకాలంటూ గతకొద్ది రోజులుగా హల్చల్ చేసిన అగ్రరాజ్యాధినేత.. ఒక్కసారే మనసు మార్చుకున్నారు. అడ్డగోలు టారిఫ్‌లతో అల్లకల్లోలం సృష్టించి.. ఇప్పటికైతే ఏం కాదులే అని ముగించేశారు.
అయితే దీని వెనుక ట్రంప్ స్వప్రయోజనాలే ఉన్నాయన్న విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుండటం గమనార్హం. అమెరికన్ బాస్ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రస్తుతం ఆ దేశాన్నేకాదు.. యావత్తు ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
Donald Trump | వాషింగ్టన్, ఏప్రిల్ 10: అమెరికాను ప్రపంచ దేశాలు అక్రమంగా దోచుకుంటున్నాయి.. ఇక ఊరుకోబోం.. మా దగ్గర్నుంచి ఇన్నాళ్లూ వసూలు చేసినదాన్ని తిరిగి తీసుకుంటాం.. నా దేశ ప్రయోజనాలకే నేను పెద్దపీట వేస్తాను.. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఇవి.. దాదాపుగా గత నెల రోజుల నుంచి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, సృష్టించిన హంగామా. అయితే ఈ నెల 2న తమ వాణిజ్య భాగస్వాములపై కొత్త టారిఫ్‌లను ప్రకటించి, 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్న ట్రంప్.. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో యూ-టర్న్ తీసుకున్నారు. చైనా మినహా మిగతా దేశాలపై టారిఫ్‌లను 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్టు చెప్పారు. కానీ ఈ నిర్ణయానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియాలో రాసిన రాతలు.. ఇప్పుడు ఆయనపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని రేకెత్తిస్తున్నాయి.
టారిఫ్‌ల వాయిదాకు కొద్దిగంటల ముందు ట్రంప్ తన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు.. అమెరికాసహా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు మొదలైన కాసేపటికే సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’పై ‘ఇది కొనడానికి సరైన సమయం’ అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘డీజేటీ’ అని కూడా పెట్టారు. ఇది జరిగిన 4 గంటల తర్వాత అదనపు టారిఫ్‌లను 90 రోజులు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
డీజేటీ అంటే ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్. టారిఫ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాకే.. ఉద్దేశపూర్వకంగా డీజేటీ షేర్ల విలువను పెంచేందుకు ట్రంప్ ఈ రకమైన పరోక్ష సంకేతాలను ఇచ్చారని ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. ఇందుకు తగ్గట్టే డీజేటీ షేర్ విలువ కూడా 22 శాతం వరకు పెరిగింది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ ఆడమ్ చిఫ్ డిమాండ్ చేశారు. ఇదో ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణమని డెమొక్రాటిక్ సెనెటర్ క్రిస్ ముర్ఫీ కూడా ఆరోపించారు.
చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు 145 శాతానికి చేరాయి. ఇప్పటికే 125 శాతంగా ఉన్న ఈ అదనపు టారిఫ్‌లు.. గురువారం మరో 20 శాతం పెరిగాయి. ఫెంటానిల్ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణలకుగాను ప్రత్యేకంగా 20 శాతం సుంకాలు వేస్తున్నట్టు ట్రంప్ తాజా అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వాణిజ్య యుద్ధానికి కొన్ని రోజులు విరామం ఇచ్చినప్పటికీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. డౌజోన్స్ ఏకంగా 1,500 పాయింట్లు లేదా 4 శాతం, నాస్డాక్ 5 శాతం నష్టపోయింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనావేసిన స్థాయి కంటే మెరుగైనవిగా ఉన్నప్పటికీ సూచీలు నష్టపోవడం విశేషం.