ముంబై, జూలై 30: దేశీయ కరెన్సీ గింగిరాలు కొడుతున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా రూపాయి విలువ 89 పైసలు పతనం చెందింది. గడిచిన మూడేండ్లలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89 పైసలు పతనం చెంది 87.80కి జారుకున్నది. దేశీయ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలను విధించనున్నట్టు ప్రకటించడంతో రూపాయికి భారీగా చిల్లులు పడ్డాయి. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధుల ప్రవాహం స్థిరంగా ఉండటంతో రూపాయిపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రారంభంలో భారీగా లాభపడింది. 87.10 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 87.05 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 89 పైసలు జారుకొని 87.80 వద్ద ముగిసింది. ఫిబ్రవరి 24, 2022 నాడు నష్టపోయిన 99 పైసలు తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. మంగళవారం రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 86.91కి జారుకున్నది తెలిసిందే.
రూపాయి మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కరెన్సీ పతనానికి కారణంకానున్నది. ఈవారంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వు, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు వడ్డీరేట్లపై నిర్ణయంపై పెట్టుబడిదారులు వేచిచూసే ధోరణి అవలంభించారు.
– అనూజ్ చౌదరీ, మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ రీసర్చ్ అనలిస్ట్