న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. అక్టోబర్ నెలలో జియో నెట్‌వర్క్‌లోకి కొత్తగా 19.97 లక్షల మంది చేరినట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దీంతో కంపెనీ మొబైల్ కస్టమర్లు 48.47 కోట్లకు చేరుకున్నారు. అలాగే భారతీ ఎయిర్టెల్ వైర్లెస్ యూజర్లు 12.52 లక్షల మంది చేరడంతో మొత్తం సంఖ్య 39.36 కోట్లకు చేరుకున్నారు.
అంతక్రితం నెలలో 39.24 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 9.25 కోట్లకు చేరారు. కానీ, వొడాఫోన్ ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. గత నెలలోనూ కంపెనీ నెట్వర్క్ నుంచి 20.83 లక్షల మంది వెళ్లిపోయారు. దీంతో కంపెనీ మొబైల్ యూజర్లు 20 కోట్లకు పడిపోయినట్టు ట్రాయ్ తన నెలవారి సమీక్షలో వెల్లడించింది. మొత్తంమీద దేశీయంగా 123 కోట్ల మంది టెలిఫోన్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నట్టు తెలిపింది.