ముంబై, ఏప్రిల్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం వల్ల ఇరు సూచీలు ఒక్క శాతం వరకు నష్టపోయాయి. వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు బుధవారం తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 756.84 పాయింట్లు కోల్పోయి 78,516.49 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 198.50 పాయింట్లు నష్టపోయి 24,378.10 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
కుప్పకూలిన హెచ్‌సీఎల్ షేరు
నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేరు కుప్పకూలింది. కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 10.85 శాతం తగ్గి రూ.1,285.20కి పరిమితమైంది. అటు ఎన్ఎస్ఈలోనూ 10.81 శాతం కోల్పోయి రూ.1,285.30 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.42,428.15 కోట్లు కరిగిపోయి రూ.3,48,760.24 కోట్లకు జారుకున్నది. దీంతోపాటు ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా పతనం చెందాయి. కానీ, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, ఎటర్నల్, ట్రెంట్ షేర్లు బలపడ్డాయి. రంగాల్లో ఐటీ రంగ సూచీ అత్యధికంగా 3.66 శాతం కోల్పోయింది. దీంతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు పతనం చెందాయి. కానీ, యుటిలిటీస్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
రూపాయి 34 పైసలు డౌన్
దేశీయ కరెన్సీకి మళ్లీ చిల్లులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో అనిశ్చితి నెలకొనడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు లేకపోవడం, గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం అంతర్జాతీయ కరెన్సీ డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నది. దీంతో ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 34 పైసలు కోల్పోయి 93.78కి జారుకున్నది. 93.69 వద్ద ప్రారంభమై.. ఇంట్రాడేలో 93.87 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 34 పైసలు కోల్పోయి 93.78 వద్ద నిలిచింది. గత మూడు సెషన్లలో కరెన్సీ విలువ 87 పైసలు పడిపోయినట్టు అయింది.