ముంబై, సెప్టెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం నష్టాలను మరింత పెంచాయి. ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 555.23 పాయింట్లు కోల్పోయి 75,577.58 వద్ద ముగిసింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 23,635.10 వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్‌లో బ్లూచిప్ సంస్థలైన ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. వీటితోపాటు సన్‌ఫార్మా, మారుతి, విప్రో, సిప్లా, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్‌ఫైనాన్స్, జియోఫైనాన్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కానీ, హెచ్ఏఎల్ షేరు 3.56 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు బీఈఎల్, అదానీపోర్ట్స్, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, నెస్లె, ఐచర్మోటర్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఇండిగో షేర్లు కూడా లాభపడ్డాయి.