ముంబై, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం సూచీల్లో జోష్ పెంచింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మరోదఫా చర్చలు జరిగే అవకాశం ఉండటంతోపాటు ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై సీజ్ఫైర్ ప్రకటించడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.
ఫలితంగా ఒక దశలో 560 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు వారాంతపు మార్కెట్ ముగిసే సమయానికి 504.86 పాయింట్లు ఎగబాకి 78,553.45 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 156.80 పాయింట్లు ఎగబాకి 24,353.55 పాయింట్ల వద్ద నిలిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కడంతో మదుపర్ల సంపద అమాంతం పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.4.84 లక్షల కోట్లు పెరిగి రూ.4,65,64,461.51 కోట్లకు(5.02 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది.