ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలోకి జారుకున్నాయి. ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు ఆసియన్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసినప్పటికీ అనిశ్చిత పరిస్థితి నెలకొనడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నాం తర్వాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 182.01 పాయింట్లు కోల్పోయి 81,451.02 పాయింట్ల వద్ద ముగిసింది.
ఒక దశలో 350 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివర్లో ఈ నష్టాలను తగ్గించుకోగలిగింది. మరో సూచీ నిఫ్టీ 82.90 పాయింట్లు కోల్పోయి 24,750.70 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా అత్యధికంగా 1.73 శాతం నష్టపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీ 1.64 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.62 శాతం, నెస్లె 1.52 శాతం, ఎన్టీపీసీ 1.49 శాతం, ఇన్ఫోసిస్ 1.43 శాతం, టాటాస్టీల్ 1.29 శాతం, సన్‌ఫార్మా 1.27 శాతం, పవర్‌గ్రిడ్ 1.13 శాతం చొప్పున నష్టపోయాయి. వీటితోపాటు టైటాన్, టీసీఎస్, మహీంద్రా, ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటర్స్, అల్ట్రాటెక్, మారుతి, కొటక్ బ్యాంక్, అదానీపోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు పతనం చెందాయి. కానీ, రిలయన్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి.