దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం ఉరకలెత్తింది.కాల్పుల విరమణతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం.. మదుపరులు మెచ్చారు. అమెరికా-చైనా ట్రేడ్ డీల్, గ్లోబల్ మార్కెట్లలో లాభాలూ కలిసొచ్చాయి. దీంతో అన్ని రంగాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఒక్కరోజే గరిష్ఠ లాభాలను అందుకున్నాయి. దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. ఆయా సంస్థల మార్కెట్ విలువ కూడా ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయిలో రూ.16.15 లక్షల కోట్లు పెరిగింది.
ముంబై, మే 12: మదుపరులలో పెట్టుబడుల ఉత్సాహం తొణికిసలాడింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు శాంతించడంతో స్టాక్ మార్కెట్లూ సోమవారం బయ్యింగ్ జోష్‌ను సంతరించుకున్నాయి. దీంతో ఈ ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీలు మునుపెన్నడూ లేనివిధంగా లాభపడ్డాయి.
సెన్సెక్స్ ఏకంగా 2,975. 43 పాయింట్లు లేదా 3.74 శాతం ఎగబాకి 82,429.90 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 916.70 పాయింట్లు లేదా 3.82 శాతం ఎగిసి 24,924.70 దగ్గర నిలిచింది. ఉదయం ఆరంభం నుంచే జోష్ మీదున్న సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ ఇంకా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలోనే ఒకానొక దశలోనైతే సెన్సెక్స్ 3,041.50, నిఫ్టీ 936.80 పాయింట్లు పుంజుకున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. దీంతో స్టాక్ మార్కెట్లూ తీవ్ర నష్టాలకు లోనయ్యాయి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో మార్కెట్ సంపద లక్ష కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. అయితే భారత్-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలు వీడాయి. అమెరికా-చైనా ట్రేడ్ డీల్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. అంతర్జాతీయ సానుకూలతలూ కలిసొచ్చాయి.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో పరుగులు పెట్టడంతో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో ఎగిసింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ సోమవారం రూ.16,15,275.19 కోట్లు పెరిగి రూ.4,32, 56,125.65 కోట్ల (5.05 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. మునుపెన్నడూ మార్కెట్ సంపద ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగలేదు. దీంతో ఇదో ఆల్‌టైమ్ సింగిల్ డే హైగా రికార్డులకెక్కింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 4.18 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 3.85 శాతం చొప్పున పెరిగాయి. కాగా, ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాం గ్ సూచీలూ లాభపడ్డాయి. ఇది కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది.