ముంబై, జూన్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. ఉదయం ప్రారంభమైన దగ్గర్నుంచి మధ్యాహ్నం ముగిసేదాకా సూచీలు ఫుల్ జోష్‌ను కనబర్చాయి. శనివారం చివరి విడుత పోలింగ్ ముగిశాక విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఊపును తీసుకొచ్చాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కారే వస్తుందన్నట్టుగా సీట్ల లెక్కలున్నాయి. ఈ క్రమంలోనే అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ.. ఆల్‌టైమ్ హై రికార్డులకు చేరాయి. సెన్సెక్స్ 2,507.47 పాయింట్లు లేదా 3.39 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 76,468.78 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో తొలిసారి 76,738.89 స్థాయిని తాకింది. నిఫ్టీ 733.20 పాయింట్లు లేదా 3.25 శాతం ఎగబాకి గతంలో ఎప్పుడూ లేనివిధంగా 23,263.90 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో మొదటిసారి 23,338.70 స్థాయిని చేరింది. ఇదిలావుంటే 2021 ఫిబ్రవరి 1 నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కరోజే ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. నాడు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దాదాపు 5 శాతం పుంజుకున్నాయి. 2019 మే 20న కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు 3 శాతానికిపైగా పెరిగాయి. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే గద్దెనెక్కుతుందన్న అంచనాలు.. పెట్టుబడులకు దోహదం చేసింది.
రంగాలవారీగా..
ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యుత్తు, చమురు, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ తదితర రంగాల సూచీలు 8 శాతం వరకు పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. 8 శాతం వరకు పుంజుకున్నాయి. దేశ జీడీపీపై వచ్చిన అంచనాలు కూడా మార్కెట్ ర్యాలీకి కలిసొచ్చినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలావుంటే అదానీ గ్రూప్ షేర్లు ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ రూ.19.42 లక్షల కోట్లను చేరింది. అదానీ పవర్ షేర్ విలువ దాదాపు 16 శాతం ఎగిసింది. అదానీ పోర్ట్స్ 10 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 6 శాతానికిపైగా పుంజుకున్నది.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు లాభపడ్డాయి. చైనా నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే కదలాడుతున్నాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 3.54 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 2.05 శాతం చొప్పున పెరిగాయి. ఒకానొక దశలో ఆల్‌టైమ్ హైని తాకాయి.
ఒక్కరోజే 13.78 లక్షల కోట్లు..
సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల నడుమ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మదుపరుల సంపద కొత్త గరిష్ఠాలకు చేరింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.13,78,630.4 కోట్లు ఎగిసి తొలిసారి రూ.4,25,91,511.54 కోట్లకు (5.13 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లోని కంపెనీల మార్కెట్ విలువ కూడా రూ.422.48 లక్షల కోట్ల (5.09 ట్రిలియన్ డాలర్లు)కు వెళ్లింది.
ఆరంభంలో..
2,622 పాయింట్లు ఎగిసి
76,583.29 వద్దకు సెన్సెక్స్
807 పాయింట్లు ఎగబాకి
23,337.90 వద్దకు నిఫ్టీ
ఇంట్రాడేలో..
2,778 పాయింట్లు పుంజుకుని
76,738.89 వద్దకు సెన్సెక్స్
808 పాయింట్లు అందుకుని 23,338.70 వద్దకు నిఫ్టీ
ముగింపులో..
2,507 పాయింట్లు పెరిగి
76,468.78 వద్ద సెన్సెక్స్
733 పాయింట్లు వృద్ధి చెంది
23,263.90 వద్ద నిఫ్టీ