ముంబై, డిసెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఉదయం భారీగా నష్టాలు ఎదురవగా, ఆఖర్లో తేరుకుని లాభపడ్డాయి. అమ్మకాల ఒత్తిడితో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఉదయం ఏకంగా 1,207.14 పాయింట్లు పడిపోయింది. అయితే ఆ తర్వాత మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నది. ఈ క్రమంలోనే 843.16 పాయింట్లు లేదా 1.04 శాతం పుంజుకొని 82,133.12 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 923.96 పాయింట్లు లేదా 1.13 శాతం ఎగబాకడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా ఇంట్రా-డేలో 367.90 పాయింట్లు దిగజారింది. కానీ ఆఖర్లలో 219.60 పాయింట్లు లేదా 0.89 శాతం పెరిగి 24,768.30 వద్ద నిలిచింది.
ఉదయం ఆరంభం నుంచే మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండస్ట్రియల్స్ రంగాల షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్‌ల్లో పెద్ద ఎత్తున సెల్లింగ్ ప్రెషర్ నమోదైంది. దీంతో సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు 3.5 శాతానికి మందగించడం ఇన్వెస్టర్లను ఒకింత ఆందోళనకు గురిచేసింది.
అయితే ద్రవ్యోల్బణం గతంతో పోల్చితే శాంతించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో నవంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.48 శాతంగా నమోదైంది. ముఖ్యంగా రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించడానికున్న అవకాశాలను ఇది సజీవం చేసింది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 6.21 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఆకట్టుకున్నాయి. టెలికం, టెక్నాలజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లూ లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. దక్షిణ కొరియా మార్కెట్ మాత్రం లాభపడింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 0.54 శాతం ఎగిసి 73.77 డాలర్లు పలికింది. ఇక భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. గురువారం మరో రూ.3,560.01 కోట్ల పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు.