ముంబై, జనవరి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.55 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 76వేల మార్కును దాటి 76,532.96 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 698.32 పాయింట్లు పుంజుకున్నది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 205.85 పాయింట్లు లేదా 0.90 శాతం ఎగిసి 23వేల స్థాయికి ఎగువన 23,163.10 వద్ద నిలిచింది.
ఐటీ, రియల్టీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. రియల్టీ రంగ సూచీ అత్యధికంగా 3.10 శాతం పెరిగింది. ఇండస్ట్రియల్స్ 2.94 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.70 శాతం ఐటీ 2.65 శాతం, కమోడిటీస్ 2.30 శాతం, హెల్త్‌కేర్ 2.20 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు మాత్రం నష్టపోయాయి. జొమాటో షేర్ విలువ గరిష్ఠంగా 7 శాతం ఎగబాకింది. టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లూ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 2.54 శాతం, స్మాల్‌క్యాప్ 3.28 శాతం పెరిగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ షేర్లు నిరాశపర్చాయి. మాతృ సంస్థతో విడిపోయి స్టాక్ ఎక్సేంజీల్లోకి బుధవారమే ప్రవేశించిన ఈ సంస్థ షేర్లు.. తొలిరోజే 5 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. రూ.188 వద్ద లిస్టింగ్ అవగా, బీఎస్ఈలో రూ.178.60 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.171.85 వద్ద నిలిచాయి.