ముంబై, నవంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి దీపావళి సంబురాలు ముందే వచ్చినట్టున్నాయి. వరుస లాభాల్లో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 594.91 పాయింట్లు లేదా 0.92 శాతం పుంజుకొని 64,958.69 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 628.76 పాయింట్లు ఎగబాకడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 181.15 పాయింట్లు లేదా 0.94 శాతం ఎగిసి 19,411.75 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు రోజుల్లోనూ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. దీంతో ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1,367 పాయింట్లు, నిఫ్టీ 422 పాయింట్లు అందిపుచ్చుకున్నైట్టెంది.
ఆది నుంచీ దూకుడే..
ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర్నుంచీ మదుపరులు పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చారు. దీంతో సూచీలు ఆరంభంలోనే భారీ లాభాలను సొంతం చేసుకోగలిగాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఈ లాభాలు పెరుగుతూపోగా.. ఆఖర్లో కొంతమేర అమ్మకాల ఒత్తిడి నెలకొన్నది. అయినప్పటికీ ఆకర్షణీయ వృద్ధినే సూచీలు అందుకోగలిగాయి. గత వారం గురు, శక్రవారాల్లోనూ సూచీలు లాభాల్లోనే ముగియగా.. అంతకుముందు రోజుల్లో మాత్రం కొంత ఒడిదుడుకులకు లోనైన సంగతి విదితమే.
చిన్న షేర్లూ అదుర్స్
కేవలం బడా షేర్లకేగాక.. చిన్న, మధ్యశ్రేణి షేర్లకూ మదుపరులు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.90 శాతం ఎగిశాయి. ఇక సెన్సెక్స్ షేర్లలో ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు జూమ్ అయ్యాయి. అయితే ఎస్బీఐ, హిందుస్థాన్ యునిలివర్, టాటా మోటర్స్, టైటాన్ షేర్లు నిరాశపర్చాయి. రంగాలవారీగా క్యాపిటల్ గూడ్స్ 1.68 శాతం, మెటల్ 1.64 శాతం, ఇండస్ట్రియల్స్ 1.42 శాతం, యుటిలిటీస్ 1.39 శాతం, కమోడిటీస్ 1.38 శాతం, చమురు-గ్యాస్ 1.33 శాతం, ఎనర్జీ 1.27 శాతం, రియల్టీ 1.19 శాతం, బ్యాంకింగ్ 0.74 శాతం, ఆటో షేర్లు 0.65 శాతం చొప్పున పెరిగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో మాత్రం ప్రధాన ఇండెక్స్‌లైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇక శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. కాగా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) పెట్టుబడుల ఉపసంహరణ దిశగా వెళ్తున్నారు. శుక్రవారం రూ.12.43 కోట్ల షేర్లను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజ్ గణాంకాలు చెప్తున్నాయి.
మార్కెట్ లాభాలకు కారణాలు
ర్యాలీతో 8 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలు.. మదుపరుల సంపదనూ పెంచుతున్నాయి. గత మూడు రోజుల్లో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.7.95 లక్షల కోట్లు ఎగబాకింది. రూ.7,95,290.63 కోట్లు పెరిగి రూ.3,18,17,766.44 కోట్లకు చేరినట్టు స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు పేర్కొన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై అంతర్జాతీయ పరిణామాల ప్రభావమే ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇస్తుందన్న అంచనాలు మదుపరుల పెట్టుబడులను అధికంగా ప్రభావితం చేశాయి. అయితే చాలా రోజుల్నుంచి విదేశీ అంశాలపైనే దృష్టి పెట్టిన మదుపరులు.. తమ చూపును దేశీయ వ్యాపారాల వైపు తిప్పుకున్నారనిపిస్తున్నది. ఈ క్రమంలోనే పండుగ సెంటిమెంట్ కలిసొస్తున్నది.
-వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి