FII | ముంబై, ఫిబ్రవరి 14 : విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఇంటిదారి పట్టారు. భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వీలైనంత ఎక్కువగా వెనక్కి తీసేసుకుంటున్నారు. దేశీయంగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్ఐఐల్లో సుమారు 35 శాతం అమెరికాకు చెందినవారే. అగ్రరాజ్యాధినేత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వీరి పెట్టుబడుల ఉపసంహరణలు ఇటీవలికాలంలో పెరిగాయి. జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గమనార్హం. గత నెల 23 రోజులు ట్రేడింగ్ జరిగితే 22 రోజులు ఎఫ్ఐఐలు అమ్మకాలకే పెద్దపీట వేశారు. ఫిబ్రవరిలోనూ ఇదే జరుగుతుండగా.. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తరలిపోయిన విదేశీ పెట్టుబడుల విలువ లక్ష కోట్ల రూపాయలపైనే ఉన్నట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) ద్వారా అందుతున్న సమాచారం. ఈ నెలలో 10 రోజులపాటు ట్రేడింగ్ జరిగితే, 9 రోజులు పెట్టుబడుల ఉపసంహరణలే. ఈ క్రమంలోనే ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,856.34 కోట్లు వెనక్కిపోయినైట్టెంది.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో విదేశీ పెట్టుబడిదారులు యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు అత్యంత గమనించదగ్గ అంశంగా నిలుస్తున్నది. గడిచిన పదేండ్లలో భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐ పెట్టుబడుల వాటా 4 శాతానికిపైగా క్షీణించింది. 2015 జనవరిలో 20.2 శాతంగా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో 16 శాతంగా ఉన్నది. ఇది 12 ఏండ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఇక గత ఏడాది అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోనే ఉంటున్నారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. నిరుడు డిసెంబర్‌తో పోల్చితే గత నెల జనవరిలో ఎఫ్ఐఐ ఈక్విటీ అసెట్స్ అండర్ కస్టడీ (ఏయూసీ) కూడా రూ.67.7 లక్షల కోట్లకు పడిపోయాయి. డిసెంబర్ ఆఖర్లో రూ.71.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో నెల రోజుల్లో రూ.3.4 లక్షల కోట్లు హరించుకుపోయినట్టు తేలింది.
బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లకు ఎఫ్ఐఐలు దూరంగా ఉంటున్నారు. ఒక్క జనవరిలోనే 2.8 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) సూచీ నుంచి ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకున్నారు. ఐటీ రంగం నుంచి కూడా747 మిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. ఇక చమురు-గ్యాస్, ఆటో రంగాల షేర్లపై పెట్టిన పెట్టుబడులూ తగ్గిపోతున్నాయి. ఆటో నుంచి 672 మిలియన్ డాలర్లు వెళ్లిపోయాయి. కాగా, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఖాయమైన దగ్గర్నుంచే ఎఫ్ఐఐలు.. భారతీయ మార్కెట్లకు మరింత దూరంగా కదులుతున్నారు. డాలర్ విలువ పెరిగి రూపాయి బలహీనపడటం, స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం, బంగారం ఆకర్షణీయంగా మారడం, పరస్పర సుంకాలతో వాణిజ్య యుద్ధం భయాలు వెంటాడటం వంటివి ఎఫ్ఐఐలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.