గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ భారీ లాభాలనే అందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్, ఫలితాల ప్రభావం ట్రేడింగ్‌పై ప్రస్ఫుటంగా కనిపించింది. మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. ఈ క్రమంలోనే సోమవారం ఆల్‌టైమ్ హైకి చేరినా.. మంగళవారం మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా సూచీలు రికార్డు స్థాయి నష్టాలపాలయ్యాయి.
అయినప్పటికీ తర్వాతి మూడు రోజులు కోలుకుని పరుగులు పెట్టాయి. దీంతోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,732.05 పాయింట్లు పుంజుకొని 76,693.36 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 759.45 పాయింట్లు అందుకుని 23,290.15 దగ్గర నిలిచింది. ఈ క్రమంలో ఈ వారం కూడా సూచీలు లాభాల్లోనే కదలాడవచ్చన్న అంచనాలున్నాయి.
ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 22,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 23,600-23,800 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.