ముంబై, మార్చి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయంగా యుటిలిటీ, పవర్ రంగ షేర్లు భారీగా పుంజుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల యుద్ధానికి తెరలేపడంతో గత నెలరోజులుగా తీవ్ర ఒడిదుడులకు గురైన సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 740.30 పాయింట్లు లేదా 1.01 శాతం అందుకొని తిరిగి 73 వేల పాయింట్ల పైన 73,730.23 వద్ద ముగిసింది. గత పది సెషన్లుగా నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 254.65 పాయింట్లు లేదా 1.15 శాతం అందుకొని 22,337.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా పెరిగింది. అలాగే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.
8 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరులు ఖుషి అవుతున్నారు. గత కొన్ని రోజులుగా నష్టాలే పరమావదిగా కొనసాగిన సూచీలు బుధవారం భారీగా పుంజుకోవడంతో మదుపరుల సంపద 8 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.7,97,247.7 కోట్లు పెరిగి రూ. 3,93,04,041.75 కోట్లు(4.51 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది. భారత్‌పై సుంకాలను విధించడానికి ట్రంప్ సిద్ధమవుతున్నప్పటికీ మదుపరుల్లో సెంటిమెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.