ముంబై, జూలై 20: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్ రంగాల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కదంతొక్కాయి. పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చమురు రంగాలకు చెందిన సంస్థల షేర్లను ఎగబడి కొనుగోళ్ళు జరిపారు. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 629.91 పాయింట్లు లేదా 1.15 శాతం లాభపడి 55,397.53 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 862 పాయింట్లు లాభపడి చివరకు ఈ లాభాలను నిలుపుకోలేకపోయింది.
మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక స్థాయి 16,500 మైలురాయిని అధిగమించింది. చివరకు 180.30 పాయింట్లు లేదా 1.10 శాతం అందుకొని 16,520.85 వద్ద ముగిసింది. మార్కెట్లో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ పెట్టుబడులు పెట్టడం సూచీలకు జోష్‌నిచ్చింది. ఓఎన్జీసీ 4 శాతం, రిలయన్స్ 2.47 శాతం, టెక్ మహీంద్రా 3.84 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.08 శాతం, టీసీఎస్ 2.89 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం, ఎస్బీఐ 2.13 శాతం, హెచ్‌యూఎల్ 1.55 శాతం, విప్రో 1.63 శాతం చొప్పున పెరిగాయి. కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా 1.81 శాతం తగ్గగా, సన్‌ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్‌లు తగ్గాయి.