దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 739.87 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగబాకి 80 వేల మార్కుకు ఎగువన 80,597.66 దగ్గర నిలిచింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 268 పాయిం ట్లు లేదా 1.10 శాతం ఎగిసి 24,631.30 వద్ద స్థిరపడింది. 6 వారాల తర్వాత నమోదైన లాభాలివి. అయినప్పటికీ ఈ వారం మదుపరులు కొనుగోళ్లు, అమ్మకాల మధ్య ఊగిసలాటకు గురికావచ్చన్న అంచనాలున్నా యి. డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై టారిఫ్లపట్ల స్పందించే తీరు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు మరి. అయితే భారత రుణ పరపతిని ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ దాదాపు 2 దశాబ్దాల తర్వాత పెంచడం, రిటైల్-హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడం వంటివి కలిసొస్తే పెట్టుబడులకు వీలు లేకపోలేదు. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమేనని చెప్పవచ్చు. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,100 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,900-25,100 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడుదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.