ముంబై, ఆగస్టు 14: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. ఐటీ సూచీల ర్యాలీకి తోడు అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం సూచీలకు దన్నుగా నిలిచాయి. సెప్టెంబర్ సమీక్షలోనే ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఒక దశలో 250పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 149.85 పాయింట్లు లాభపడి 79,105.88 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ స్వల్పంగా 4.75 పాయింట్లు లాభపడి 24,143.75 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కోలుకోవడం దేశీయ సూచీలకు కలిసొచ్చిందని, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగా ఉండనున్నట్లు వచ్చిన సంకేతాలు కొనుగోళ్ల వైపు నడిపించాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఐటీ షేర్లలో జోష్
ఐటీ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి. టీసీఎస్ షేరు అత్యధికంగా 2 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లతోపాటు మహీంద్రా, ఎయిర్టెల్, టాటా మోటర్స్, ఎస్బీఐ, టైటాన్, ఐటీసీ, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు లాభాల్లో ముగిశాయి. కానీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, రిలయన్స్‌లు నష్టపోయాయి.
గనుల షేర్లు ఢమాల్
ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ర్టాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఈ రంగ షేర్లు కుప్పకూలాయి. ఏప్రిల్ 1, 2005 నుంచి రాయిల్టీని పొందేలా రాష్ర్టాలకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం మైనింగ్ పరిశ్రమపై ఆర్థిక భారం పడనున్నది. దీంతో ఈ రంగ షేర్లు ఆరు శాతం వరకు నష్టపోయాయి. దేశీయ ఇనుప ఖనిజ ఉత్పత్తి దిగ్గజం ఎన్ఎండీసీ షేరు అత్యధికంగా 6 శాతం నష్టపోగా, హిండ్ కాపర్ 4 శాతం, నాల్కో 2.7 శాతం చొప్పున పతనం చెందాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ రంగం సూచీ 1.41 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు లాభాల్లో ముగియగా..కమోడిటీస్, ఎనర్జీ, టెలికం, యుటిలిటీ, మెటల్, పవర్, రియల్టీ, సర్వీసెస్ రంగ సూచీలు నష్టపోయాయి.
నేడు మార్కెట్లకు సెలవు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీంతో ఈ వారంలో నాలుగు రోజులు ట్రేడింగ్ జరగనున్నది. తిరిగి శుక్రవారం సూచీలు యథావిథిగా పనిచేయనున్నాయి.