ముంబై, నవంబర్ 7 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 94.73 పాయింట్లు కోల్పోయి 83,216.28 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 640 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీకి చివర్లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన వార్తలు నష్టాలను నియంత్రించగలిగాయి. మరో సూచీ నిఫ్టీ 25,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 17.40 పాయింట్లు కోల్పోయి 25,492.30 వద్ద నిలిచింది. దేశీయ టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ షేరు 4.46 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. కంపెనీలో సింగ్టెల్ వాటాను విక్రయించడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
దీంతోపాటు టెక్ మహీంద్రా, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు నష్టాలను తగ్గించుకోగలిగాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రంగాలవారీగా టెక్నాలజీ రంగ సూచీ అత్యధికంగా 1.46 శాతం నష్టపోగా..టెలికాం 1.19 శాతం, పవర్, ఐటీ, సర్వీసెస్ రంగ సూచీలు నష్టపోయాయి. కానీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కమోడిటీస్, ఆటో, బ్యాంకింగ్ రంగ సూచీలు లాభపడ్డాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 722.43 పాయింట్లు, నిఫ్టీ 229.8 పాయింట్లు నష్టపోయాయి.
విదేశీ నిల్వలు మరింత కరిగిపోయాయి. అక్టోబర్ 31తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.62 బిలియన్ డాలర్లు తరిగిపోయి 689.73 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 6.925 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది.