ముంబై, నవంబర్ 28 : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. దేశీ జీడీపీ గణాంకాలు విడుదలకానుండటంతో మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. దీంతో సూచీల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 13.71 పాయింట్లు నష్టపోయి 85,706.67 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 12.60 పాయింట్లు కోల్పోయి 26,202.95 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకిన సూచీలకు దేశ వృద్ధిరేటు గణాంకాలు బ్రేక్‌వేశాయి. ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు లేవన్న అంచన మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. ఫలితంగా సూచీలు నష్టాలకు జారుకున్నాయి. సూచీల్లో పవర్ గ్రిడ్, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా నష్టపోగా..మహీంద్రా, సన్‌ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఎనర్జీ, పవర్, యుటిలిటీస్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించగా..ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్, హెల్త్‌కేర్, మెటల్, సర్వీసెస్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 474.75 పాయింట్లు, నిఫ్టీ 134.8 పాయింట్ల చొప్పున బలపడ్డాయి.
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 21తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.47 బిలియన్ డాలర్లు తరిగిపోయి 688.1 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. పసిడి రిజర్వులు విలువ పడిపోవడం వల్లనే విదేశీ నిల్వలు తగ్గాయని పేర్కొంది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.69 బిలియన్ డాలర్లు తగ్గి 560.6 బిలియన్ డాలర్లకు పడిపోవడం మొత్తం రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపింది. అలాగే గోల్డ్ రిజర్వులు 2.675 బిలియన్ డాలర్లు తగ్గి 104.182 బిలియన్ డాలర్లకు పరిమితమవగా, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్ఎస్) కూడా 84 మిలియన్ డాలర్లు తగ్గి 18.566 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతక్రితం వారంలో రిజర్వులు 5.54 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.