Stock Markets | ముంబై, అక్టోబర్ 29 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు.. బ్యాంకింగ్, చమురు రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. 600 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఒక దశలో 79,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలకుతోడు బ్యాంకింగ్, క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడంతో 363.99 పాయింట్లు లాభపడి 80,369.03 వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ 127.70 పాయింట్లు ఎగబాకి 24,466.85 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో తిరిగి సూచీలు లాభాల్లోకి రాగలిగాయి. ఎస్బీఐ షేరు అత్యధికంగా 5 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతి, టాటా మోటర్స్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రాలు నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ సూచీ అత్యధికంగా 2.20 శాతం లాభపడగా, ఆర్థిక సేవలు 2 శాతం, రియల్టీ 1.46 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.28 శాతం, యుటిలిటీ 1.26 శాతం పెరిగాయి.