ముంబై, డిసెంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.21 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 84,559.65 వద్ద ముగిసింది. ఒకానొక దశలో సూచీ 263.88 పాయింట్లు దిగజారింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 41.55 పాయింట్లు లేదా 0.16 శాతం క్షీణించి 25,818.55 వద్ద స్థిరపడింది. దీంతో అదేపనిగా భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్న విదేశీ మదుపరుల వల్లే ఈ నష్టాలని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గడిచిన 4 రోజుల్లో రూ.5,000 కోట్లకుపైగా పెట్టుబడుల్ని వెనుకకు తీసుకోవడం గమనార్హం. కాగా, సెన్సెక్స్ షేర్లలో ట్రెంట్ అత్యధికంగా 1.61 శాతం నష్టపోయింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లూ భారీగానే పతనమయ్యాయి. రంగాలవారీగా చూస్తే.. క్యాపిటల్ గూడ్స్ 0.96 శాతం, రియల్టీ 0.81 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇండస్ట్రియల్స్ 0.76 శాతం, సర్వీసెస్ 0.64 శాతం మేర నిరాశపర్చాయి.