ముంబై, నవంబర్ 17 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం ఎగిసి 84,950.95 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,988.09 స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 103.40 పాయింట్లు లేదా 0.40 శాతం ఎగబాకి మరోసారి 26 వేల స్థాయి ఎగువకు చేరి 26,013.45 వద్ద నిలిచింది.
దీంతో సూచీలు వరుసగా ఆరో రోజూ లాభాల్లో స్థిరపడినైట్టెంది. దేశీయ సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున జరిపిన కొనుగోళ్లే ఈ ర్యాలీకి కారణమని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను మిడ్‌క్యాప్ సంస్థలు ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తుండటం కూడా కలిసొస్తున్నదని చెప్తున్నారు.