ముంబై, మార్చి 24: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,078.87 పాయింట్లు లేదా 1.40 శాతం ఎగిసి 77,984.38 వద్ద స్థిరపడింది. ఇది 6 వారాల గరిష్ఠం కావడం విశేషం. ఒకానొక దశలో 1,200 పాయింట్లకుపైగా పెరిగి 78,107.23 పాయింట్లదాకా ఎగబాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 307.95 పాయింట్లు పుంజుకొని 23,658.35 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 23,708.75 స్థాయిని తాకింది. దీంతో వరుసగా ఆరోరోజూ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినైట్టెంది.
ఇదీ సంగతి..
అమెరికా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం కలిసొచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 2 నుంచి భారత్, చైనాసహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలుంటాయని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పునరాలోచనలోపడటం ఇన్వెస్టర్లను మెప్పించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను రాబోయే ద్రవ్యసమీక్షల్లో తగ్గిస్తుందన్న అంచనాలూ గట్టిగానే ఉన్నాయి. ఇవి ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలకు దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్రమేణా పెరుగుతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది.
ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ మార్కెట్లలో మళ్లీ పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తుండటం కూడా సూచీలను పరుగులు పెట్టిస్తున్నది. గత 6 రోజుల్లో ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ.8,874.88 కోట్లుగా ఉన్నాయి. నిజానికి గత 5 నెలల్లో రూ.2.5 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు బ్యాంకింగ్, యుటిలిటీస్, పవర్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ రంగాల షేర్లు 2.53 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.32 శాతం, స్మాల్‌క్యాప్ 1.17 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ షేర్ విలువ అత్యధికంగా 4.61 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ లాభాల్లో ముగియగా, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు నష్టపోయాయి.
27.10 లక్షల కోట్లు జూమ్
స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడుతుండటంతో మదుపరుల సంపద కూడా అంతకంతకూ పెరుగుతూపోతున్నది. గత 6 రోజుల్లో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.27.10 లక్షల కోట్లు ఎగబాకింది. ఈ 6 రోజుల్లో సెన్సెక్స్ 4,155.47 పాయింట్లు లేదా 5.62 శాతం, నిఫ్టీ 1,261.15 పాయింట్లు లేదా 5.63 శాతం ఎగిశాయి. ముఖ్యంగా నాలుగేండ్ల తర్వాత గత వారం మార్కెట్లు అత్యుత్తమ లాభాలను అందుకున్నాయి. ఐదు రోజుల్లో సెన్సెక్స్ 3,077 పాయింట్లు, నిఫ్టీ 953 పాయింట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల మార్కెట్ విలువ కూడా రూ.27,10,918.98 కోట్లు పుంజుకొని రూ.4,18,29,351.91 కోట్లకు చేరింది. కాగా, సెన్సెక్స్ ఫిబ్రవరిలో 4,302.47 పాయింట్లు, జనవరిలో 638.44 పాయింట్లు నష్టపోయింది. అయితే తాజా వరుస లాభాలతో ఆ నష్టం దాదాపుగా కనుమరుగైపోయింది. ఈ నెలలో 4,786.28 పాయింట్లు పుంజుకున్నది మరి.
అదానీ సంస్థలకురూ.3.4 లక్షల కోట్ల నష్టం
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భీకర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలు ఇప్పటిదాకా అదానీ సంస్థల మార్కెట్ విలువ ఏకంగా రూ.3.42 లక్షల కోట్లకుపైగా హరించుకుపోయింది మరి. ఏడాది క్రితం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీలకున్న మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 21.5 శాతానికి సమానం కావడం గమనార్హం. గత ఏడాది మార్చి 28న 11 అదానీ కంపెనీల మార్కెట్ విలువ రూ.15,93,211 కోట్లుగా ఉన్నది. ఈ నెల 21న అది రూ.12,51,059 కోట్లే. దీంతో గడిచిన ఏడాది కాలంలో రూ.3,42,152 కోట్లు పతనమైనైట్టెంది. కాగా, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ వాల్యూ గరిష్ఠంగా పడిపోయింది. దాదాపు సగం విలువ ఆవిరైపోయింది. నిరుడు మార్చి 28న రూ.2.90 లక్షల కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది మార్చి 21న రూ.1.51 లక్షల కోట్లకు దిగజారింది. అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ విలువ కూడా గణనీయంగానే క్షీణించింది. స్టాక్ మార్కెట్ల ఒడుదొడుకులు, అక్రమాల ఆరోపణలు, దర్యాప్తులు వంటివి మదుపరులను ఎక్కువగా ప్రభావితం చేశాయి.
వరుస లాభాలకు కారణాలు