ముంబై, సెప్టెంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న సూచీలు మరో మైలురాయిని అధిగమించాయి. బ్యాంకింగ్, పవర్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో ప్రారంభ నష్టాలను అధిగమించి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి.
ఇంట్రాడేలో 333 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 255.83 పాయింట్లు పెరిగి 85,169.87 వద్ద ముగిసింది. 85 వేల పైన ముగియడం స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. 30 షేర్ల ఇండెక్స్‌లో 20 షేర్లు లాభాల్లో ముగియగా, 10 షేర్లు నష్టపోయాయి. మరో సూచీ నిఫ్టీ తొలిసారిగా 26 వేల పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 26,033 పాయింట్లకు చేరుకున్న సూచీ చివరకు 63.75 పాయింట్లు అందుకొని 26,004.15 వద్ద స్థిరపడింది.
రూపాయి జోరందుకున్నది. దేశీయ ఈక్విటీలు భారీగా పుంజుకోవడంతో కరెన్సీ మరింత బలోపేతం అయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు ఎగబాకి 83.58కి చేరుకున్నది. 83.59 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 12 పైసలు లాభపడింది. చివరకు 5 పైసలు అధికమై 83.58 వద్ద స్థిరపడింది. మంగళవారం 83.63 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.