ముంబై, అక్టోబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడేలో 82 వేల పైకి చేరుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో నష్టాలోకి జారుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 153.09 పాయింట్లు కోల్పోయి 81,773.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం 62.15 పాయింట్లు కోల్పోయి 25,046.15 వద్ద స్థిరపడింది. వాహన, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోవడం వల్లనే సూచీల ర్యాలీకి బ్రేక్‌పడిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
టాటా మోటర్స్, మహీంద్రా, భారత ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, రిలయన్స్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించలేదు. కానీ, టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. వరుస ర్యాలీ తర్వాత మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం, రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల కంటే ముందు పెట్టుబడిదారులు అప్రమత్తతకు మొగ్గుచూపడం కూడా పతనానికి దోహదం చేశాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా రియల్టీ 1.88 శాతం నష్టపోగా, పవర్ 1.49 శాతం, వాహన 1.35 శాతం, యుటిలిటీ 1.29 శాతం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, ఐటీ 1.67 శాతం, టెక్నాలజీ 1.34 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.