ముంబై, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలు ర్యాలీ కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఐటీ షేర్లు కూడా కదంతొక్కడం వారాంతపు ట్రేడింగ్‌లో సూచీలు భారీగా లాభపడ్డాయి. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలకు మించి రాణించడంతో ఐటీ రంగ షేర్లకు మదుపర్ల నుంచి మద్దతు లభించింది. దీంతో ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 827.57 పాయింట్లు లేదా 1.08 శాతం అందుకొని 77,569.39 వద్ద నిలిచింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 244.10 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగబాకి 24,206.90 వద్ద స్థిరపడింది.
బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లతోపాటు జియోఫైనాన్స్, హెచ్ఏఎల్, బజాజ్ ఫైనాన్స్, అదానీపోర్ట్స్, ఇండిగో, ఎల్అండ్టీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడగా..డాక్టర్ రెడ్డీస్, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, సన్‌ఫార్మా, కోల్ ఇండియా, టీవీఎస్ మోటర్, ట్రెంట్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
రంగాలవారీగా రియల్టీ సూచీ అత్యధికంగా 3.40 శాతం లాభపడగా, పీఎస్‌యూ బ్యాంకింగ్ 3.26 శాతం, ఫోకస్డ్ ఐటీ 2.29 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2.01 శాతం, మెటల్ 1.55 శాతం, సర్వీసెస్ 1.50 శాతం చొప్పున అధికమయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 194.52 పాయింట్లు, నిఫ్టీ 63.95 పాయింట్లు పతనం చెందాయి.