ముంబై, జూన్ 26 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసొచ్చింది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా బలపడటం కూడా ర్యాలీకి దోహదం చేశాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 83 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి 1,000.36 పాయింట్లు లేదా 1.21 శాతం అందుకొని 83,755.87 పాయింట్లకు చేరుకున్నది.
మరోసూచి నిఫ్టీ 304.25 పాయింట్లు లేదా 1.21 శాతం ఎగబాకి 25,549 పాయింట్లకు చేరుకున్నది. వరుసగా మూడు రోజులుగా సూచీలు కదంతొక్కడంతో మదుపరులు రూ.9.70 లక్షల కోట్ల వరకు సంపదను పోగేశారు. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 1,859.08 పాయింట్లు లేదా 2.27 శాతం లాభపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.9,70,200.71 కోట్లు పెరిగి రూ.4, 57,52,700.57 కోట్లకు చేరుకున్నది.
మదుపరులు ఎగబడి పెట్టుబడులు పెట్టడంతో సూచీలు వరుసగా మూడు రోజుల్లో రెండు శాతానికి పైగా ఎగిశాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం సూచీలకు కలిసొచ్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం కూడా సూచీలు పుంజుకోవడానికి పరోక్షంగా దోహదం చేశాయన్నారు.