ముంబై, ఆగస్టు 24: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను పడేశాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 180.96 పాయింట్లు నష్టపోయి 65,252.34 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 57.30 పాయింట్లు కోల్పోయి 19,386.70 వద్ద జారుకున్నది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఆసియన్ సూచీల నుంచి లభించిన మద్దతుతో ప్రారంభంలో భారీగా లాభపడ్డాయి.
బ్యాంకింగ్, చమురు రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసులు 4.99 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టుబ్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్టపోగా..ఎఫ్ఎంసీజీ, ఐటీ, టెలికం, సేవలు, టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి.