ముంబై, నవంబర్ 12 : దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడోరోజూ బుధవా రం కూడా సూచీలు భారీగా లాభపడ్డాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో లాభాలతో కళకళలాడాయి. అమెరికా షట్డౌన్పై త్వరలో శుభవార్త వెలువడే అవకాశాలుండటం, ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 84 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 595.19 పాయింట్లు అందుకొని 84,466.51 పాయింట్ల వద్ద నిలిచింది. మరోసూచీ ఎస్ఎన్ఈ నిఫ్టీ 180.85 పాయింట్లు ఎగబాకి 25,875.80 వద్ద నిలిచింది.