ముంబై, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో వచ్చే సమీక్షలోనే రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. దీంతో కొనుగోళ్లకు మద్దతు పలుకడంతో దేశీయ సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. ఒక దశలో 77,145 పాయింట్లను తచ్చాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 204.33 పాయింట్ల లాభంతో 76,810.90 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ కూడా 75.95 పాయింట్లు అందుకొని 23,398.90 వద్ద నిలిచింది. ఇరు సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.431.67 లక్షల కోట్లకు చేరుకున్నది.