ముంబై, జూన్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడుతుండటంతో వరుసగా మూడు రోజుల్లో సూచీలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు క్రూడాయిల్ ధరలు దిగిరావడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 544.15 పాయింట్లు అందుకొని 76,808.48 వద్ద ముగిసింది.
ఐటీ, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగ సూచీల నుంచి లభించిన మద్దతుతోనే సూచీలు భారీగా లాభపడ్డాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 135.25 పాయింట్లు అందుకొని 23,989.15 వద్ద స్థిరపడింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 2,975.93 పాయింట్లు లేదా 4 శాతం , నిఫ్టీ 827.55 పాయింట్లు లేదా 3.57 శాతం చొప్పున బలపడ్డాయి.