కొలంబో: శ్రీలంకలోని జాఫ్నాలో సామూహిక సమాధి బయటపడింది. పిల్లలతో సహా 582 అస్థిపంజరాలు వెలుగులోకి వచ్చాయి. స్వతంత్ర తమిళ రాజ్యం కోసం పోరాడిన తమిళ టైగర్స్ అయిన ఎల్టీటీఈ, ప్రభుత్వ దళాల మధ్య జరిగిన భీకర అంతర్యుద్ధం సమయంలో అదృశ్యమైన తమిళ పౌరులకు చెందిన అవశేషాలుగా భావిస్తున్నారు. (Sri Lanka mass grave) జాఫ్నా సమీపంలోని చెమ్మని వద్ద జరిగిన తవ్వకాలలో ఇవి బయటపడ్డాయి. పిల్లల బొమ్మలు, పాల సీసాలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, గాజుల వంటి వస్తువులు కూడా లభించాయి. ఛాతికి అడ్డంగా రెండు చేతులు కట్టివేసిన స్థితిలో ఉన్న ఒక మానవ అస్థిపంజరం కూడా అక్కడ లభించింది.
కాగా, అంతర్యుద్ధ సమయంలో తమిళ పౌరులను శ్రీలంక సైన్యం కాల్చి చంపి చెమ్మని ప్రాంతంలో సామూహిక ఖననాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సామూహిక సమాధి ప్రదేశంలో 240 మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. నిజానికి 1998 నుంచే చెమ్మని ప్రాంతం ఒక సామూహిక సమాధి ప్రదేశంగా అనుమానించారు. ఒక పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో అప్పట్లో విచారణ ఎదుర్కొన్న ఒక శ్రీలంక సైనికుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. అదుపులో ఉన్న సుమారు 400 మంది తమిళులను సైన్యం చంపి చెమ్మనిలో పాతిపెట్టినట్లు దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు.
మరోవైపు 1999లో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 15 అస్థిపంజరాలు బయటపడ్డాయి. వీటిలో 10 అస్థిపంజరాలపై తీవ్రమైన దాడికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఆ తర్వాత ఆ విచారణను నిలిపివేశారు. దశాబ్దాల జాప్యం, నిధుల కొరత కారణంగా తవ్వకాలు కూడా ఆగిపోయాయి.
అయితే తాజాగా ఒక హిందూ శ్మశానవాటిక సమీపంలో అస్థిపంజర అవశేషాలను నిర్మాణ కార్మికులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం తాజాగా ఇక్కడ తవ్వకాలు జరుపడంతో 582 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ సామూహిక సమాధుల తవ్వకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు రూ.62 లక్షల నిధులు కేటాయించింది.
కాగా, 1983 నుంచి దశాబ్దాల పాటు వేలుపిళ్లై ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈ, ప్రభుత్వ సైన్యం మధ్య జరిగిన పోరాటంలో సుమారు లక్ష మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ సంఘర్షణ కారణంగా వేలాది మంది మైనారిటీ తమిళులు అదృశ్యమయ్యారు.
అయితే శ్రీలంక భద్రతా దళాలే కాకుండా, ఎల్టీటీఈ కూడా అపహరణలు, హత్యలు, అత్యాచారాలు, ఇతర అకృత్యాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 1995 నుంచి అంతర్యుద్ధం ముగిసే వరకు జాఫ్నాలోని చెమ్మని ప్రాంతం సైనిక నియంత్రణలో ఉన్నది.