ముంబై, జనవరి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు పది శాతం వరకు నష్టపోవడంతోపాటు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, గ్లోబల్ టారిఫ్ భయాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. వీటికి తోడు కార్పొరేట్ల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు నష్టాలను మరింత పెంచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక గరిష్ఠ స్థాయికి పడిపోవడం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం పతనానికా ఆజ్యంపోశాయి.
నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 670 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 324.17 పాయింట్లు కోల్పోయి 83,246.18 వద్ద స్థిరపడింది. మొత్తం షేర్లలో 3 వేల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనగా, 1,200 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, 50 షేర్ల ఇండెక్స్ సూచీ నిఫ్టీ 108.85 పాయింట్లు కోల్పోయి 25,585.50 వద్ద నిలిచింది.
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ షేరు భారీగా పతనం చెందింది. ఇంట్రాడేలో 3.72 శాతం వరకు నష్టపోయిన కంపెనీ షేరు చివరకు 3.04 శాతం నష్టంతో రూ.1,413.25 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ షేరు 3 శాతం కోల్పోయి 1,413.60 వద్ద నిలిచింది.
దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.60 వేల కోట్లు కరిగిపోయి రూ.19,12,476.70 కోట్లకు పరిమితైంది. దీంతోపాటు విప్రో షేరు 8 శాతం పతనం చెందింది. ఒక దశలో 10 శాతం వరకు నష్టపోయిన విప్రో షేరు చివరకు 8 శాతం తగ్గి రూ.246 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.22, 282.64 కోట్లు కరిగిపోయి రూ.2,57,977. 45 కోట్ల వద్ద నిలిచింది.