Stock Market | ముంబై, డిసెంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెళ్లిపోవడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. తీవ్ర ఒడిదొడుకుల మధ్య ట్రేడైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 450.94 పాయింట్లు నష్టపోయి 78,246.13 వద్ద ముగిసింది. 30 షేర్ల ఇండెక్స్‌లో 23 నష్టపోగా, కేవలం ఏడు మాత్రమే లాభాల్లో ముగిశాయి.
మరోసూచీ నిఫ్టీ 168.50 పాయింట్లు కోల్పోయి 23,644.90 వద్ద ముగిసింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ అత్యధికంగా 2.24 శాతం నష్టపోయింది. దీంతోపాటు టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్‌లు నష్టపోయాయి. కానీ, జొమాటో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు లాభాల్లో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే మెటల్ రంగ సూచీ అత్యధికంగా 2 శాతం వరకు నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్ 1.84 శాతం, సర్వీసెస్, ఇండస్ట్రీయల్స్, కమోడిటీస్ సూచీలు పతనం చెందాయి. మరోవైపు, రూపాయి గింగిరాలు కొడుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న విలువ మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి విలువ 4 పైసలు కోల్పోయి 85.52 వద్ద నిలిచింది.