న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశీయ ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా.. విదేశీ బాట పట్టింది. అమెరికాకు చెందిన ఆర్గనాన్ అండ్ కోను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. పూర్తిగా నగదు రూపంలో జరుగనున్న ఈ ఒప్పందం విలువ 11.75 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైగా) ఉంటుందని అంచనా. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు సన్‌ఫార్మా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2021లో మెర్క్ సంస్థ ఈ ఆర్గనాన్ను ప్రారంభించింది.
ఈ కొనుగోలు ఒప్పందానికి అన్ని అనుకూలిస్తే సన్‌ఫార్మా అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్స్ దిగ్గజాల్లో 25వ సంస్థగా అవతరించనున్నది. ఇరు సంస్థలు కలిపి ఆదాయం 12.4 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నది. బ్రాండ్స్, బ్రాండెజ్ జనరిక్ ఔషధ మార్కెట్లో ఇరు సంస్థలు దూసుకుపోనున్నాయి.
ఈ కొనుగోలు ఒప్పందంపై సన్‌ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ… అంతర్జాతీయ వ్యాపార విస్తరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్న సంస్థకు ఈ ఒప్పందం కీలకంగా మారనున్నదని, గ్లోబల్ మార్కెట్లో ఆర్గనాన్ ఔషధాలకు ఉన్న డిమాండ్ సంస్థకు కలిసిరానున్నదన్నారు. ఈ ఒప్పందం పూర్తైన తర్వాత అంతర్జాతీయ మహిళా హెల్త్ కంపెనీల్లో మూడో స్థానానికి సన్‌ఫార్మా చేరుకోనుండగా, అలాగే బయోసిమిలర్ ఉత్పత్తుల్లో ఏడో స్థానాన్ని కైవసం చేసుకోనున్నది. భవిష్యత్తులో సన్‌ఫార్మా తన వ్యాపారాన్ని 150 దేశాలకు విస్తరించినట్లు కానున్నది.