ముంబై, జూలై 9: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,760 కోట్ల లాభంతో పోలిస్తే 4.61 శాతం వృద్ధిని కనబరిచింది. 315 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ ఐటీ రంగానికి కృత్రిమ మేధస్సుతో ఇబ్బందులు తప్పవనే అంచనాల నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లాభాల్లో వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14 శాతం ఎగబాకి రూ.72,275 కోట్లకు చేరుకోగా, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2.23 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
దీంట్లో ఏఐ టెక్నాలజీ సేవలు అందించడంతో సంస్థకు 2.6 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరడం విశేషం. ఈ సందర్భంగా టీసీఎస్ సీఈవో, ఎండీ కే కృతివాసన్ మాట్లాడుతూ..భౌగోళిక రాజకీయ, స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఈ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసుకున్నట్టు, వినియోగదారులు ఏఐ, ఆధునీకరణ, సైబర్ సెక్యూరిటీ, సావరిన్ క్లౌడ్ టెక్నాలజీపై దృష్టి సారించడం కలిసొచ్చిందన్నారు. గత త్రైమాసికంలో కొత్తగా 9.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. వీటిలో 800 మిలియన్ డాలర్ల విలువైన ఏఐ ఆధారిత ఒప్పందాలు ఉండటం విశేషం.
గడిచిన త్రైమాసికంలో టీసీఎస్ కొత్తగా 9,200 మంది ఉద్యోగులను నియమించుకున్నది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కి చేరుకున్నారు. కంపెనీలో ఉద్యోగుల వలసలు 13.6 శాతంగా నమోదయ్యాయి. నూతన టెక్నాలజీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్ట్స్ జనరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫాం కోసం దీర్ఘకాలికంగా పెట్టుబడులు కొనసాగనున్నాయని కంపెనీ చీఫ్ మానవ వనరుల అధికారి సుదీప్ కున్నుమాల్ తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు స్వల్పంగా నష్టపోయి రూ.2,047.75 వద్ద ముగిసింది.