న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నో కొత్త రికార్డులను నెలకొల్పాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) రెండూ ఆల్టైమ్ హైలతో అదరగొట్టాయి. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. గతకొద్ది రోజులుగా సూచీలు వరుస నష్టాలకే పరిమితమవుతున్నాయి మరి. ఈ క్రమంలోనే సెప్టెంబర్లో రికార్డు స్థాయిల నుంచి గమనిస్తే.. సెన్సెక్స్, నిఫ్టీలు 10 శాతానికిపైగా పడిపోయాయి. మరికొద్ది రోజులూ దిద్దుబాటు దిశగానే ఈక్విటీ మార్కెట్లు పయనించవచ్చన్న అంచనాలున్నాయి.
ఇదీ సంగతి..
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో చైనా ఉద్దీపనలతో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుపోతుండటం కూడా ఉన్నది. గత నెలలోనే రూ.94,000 కోట్లు తరలిపోయాయి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను ఆయా సంస్థలు ప్రకటిస్తున్న నిరాశాజనక ఆర్థిక ఫలితాలూ కారణమే. అంతేగాక మదుపరుల లాభాల స్వీకరణ, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పరుగులు పెడుతుండటం కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 27న సెన్సెక్స్ ఆల్టైమ్ హై 85,978.25 పాయింట్లను చేరింది. తొలిసారి నిఫ్టీ కూడా 26,277.35 పాయింట్లను తాకింది. అయితే అక్టోబర్ నుంచి మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై స్థాయి నుంచి చూస్తే ప్రస్తుతం సెన్సెక్స్ 8,397.94 పాయింట్లు లేదా 9.76 శాతం కోల్పోయింది. నిఫ్టీ సైతం 2,744.65 పాయింట్లు లేదా 10.44 శాతం పడిపోయింది.