Indian Banks | న్యూఢిల్లీ, మే 13: భారతీయ బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. పూచీకత్తు ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నది. ఇటీవలికాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం పర్యవేక్షణ లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లపై కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే.
ఆయా సంస్థలపై రకరకాల ఆంక్షలనూ విధించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో ఫిచ్ రేటింగ్స్ హెచ్చరిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు. ‘భారతీయ బ్యాంకులపై రిస్క్ ప్రొఫైల్ ప్రభావం ఎక్కువ’ అనే శీర్షికతో సోమవారం ఫిచ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో రుణాల్లో వృద్ధి నమోదైందని సంబురపడాల్సిన పనిలేదని, ఆ రుణాలతో కనిపించని ఇబ్బందులు ఎన్నో ఎదురుకావచ్చని హెచ్చరించడం గమనార్హం.
రిటైల్ రుణాలతో..
ఈ ఏడాది మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రుణాలు 16 శాతం పెరిగాయి. ఇందులో రిటైల్ రుణాలు దాదాపు 10 శాతంగా ఉన్నాయి. 2020-21 నుంచి చూస్తే వీటి వార్షిక చక్ర వృద్ధిరేటు (సీఏజీఆర్) 20 శాతంగా ఉన్నది. అయితే పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డుల వంటి రిటైల్ రుణాల్లో పెరుగుదల.. మొత్తం లోన్లకున్న ముప్పును పెంచుతుందని ఫిచ్ చెప్తున్నది. ఈ అన్సెక్యూర్డ్ లోన్లు ఎంత పెరిగితే అంత ఇబ్బందులేనని పేర్కొన్నది.
లోపాలు అనేకం
రిటైల్ రుణాలకు సంబంధించి పాటిస్తున్న పూచీకత్తు ప్రమాణాల్లో పారదర్శకత చాలా తక్కువగా ఉందని ఫిచ్ చెప్తున్నది. లోన్-టు-వాల్యూ రేషియో, రుణగ్రహీత రుణ చరిత్ర, రుణాలు తీసుకునేవారి ఆర్థిక సామర్థ్యం, వారి క్రెడిట్ స్కోర్, రికవరీ శాతం వంటి అంశాల్లో ఇతర ఆసియా దేశాల బ్యాంకులతో పోల్చితే భారతీయ బ్యాంకుల్లో ప్రమాణాలు సరిగా లేవని ఫిచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిబంధనల అమలు ఒకింత నిర్లక్ష్యంగా ఉన్నదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ఫిచ్.. ఈ విషయంపై ఆయా బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది.
గృహస్తుల రుణాలు తక్కువే
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారత్లోని గృహస్తుల రుణాలు తక్కువేనని ఫిచ్ చెప్పింది. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీడీపీలో ఈ రుణాల వాటా 38 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. అయినప్పటికీ ఇతర దేశాలతో చూస్తే హోజ్హోల్డ్ డెట్ తక్కువగానే ఉన్నట్టు ఫిచ్ గుర్తుచేసింది. కాగా, ఇటీవలే ఆర్బీఐ.. గృహస్తుల పొదుపు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పినది తెలిసిందే.